pop

బాహుబలి-2 దృశ్యాలు బహిర్గతం యూట్యూబ్‌లో ఉంచిన నిందితుడు


హైదరాబాద్‌: వచ్చే వేసవిలో విడుదల కానున్న ‘బాహుబలి-2’ సినిమాలోని కొన్ని దృశ్యాలను ఇంటిదొంగలే సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. సోమవారం రాత్రి అవి యూట్యూబ్‌లో ప్రత్యక్షమవ్వడంతో నిర్మాత యార్లగడ్డ శోభు, దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి హతాశులయ్యారు. వెంటనే తేరుకుని వివరాలు సేకరించారు. అన్నపూర్ణ స్టూడియోలో బాహుబలి-2 కంప్యూటర్స్‌ గ్రాఫిక్స్‌ (సీజీ)పనులు చేస్తున్న విభాగంలో (ట్రైనీ) డిజైనర్‌ కృష్ణ దయానంద్‌ చౌదరి ఇందుకు కారణమని గుర్తించారు. అతడి చరవాణి ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం ఉదయం పట్టుకున్నారు. నిందితుడిని సాయంత్రం సైబర్‌నేరాల విభాగం పోలీసులకు అప్పగించారు. చిత్రనిర్మాత శోభు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కృష్ణ దయానంద్‌చౌదరిని విచారించగా.. తాను తస్కరించానని ఒప్పుకొన్నాడు. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన కృష్ణ అన్నపూర్ణ స్టూడియోలోని సీజీ విభాగంలో రెండు నెలల కిందట చేరాడు. ఆదివారం ఎక్కువగా పనిచేసేవారు రాకపోవడంతో పదినిముషాల దృశ్యాలను పెన్‌డ్రైవ్‌లోకి తీసుకున్నాడు. అనంతరం తన లాప్‌ట్యాప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. విజయవాడలో ఉన్న ఇద్దరు స్నేహితులకు 2.50నిముషాల నిడివున్న రెండు దృశ్యాలను చరవాణి ద్వారా పంపించాడు. సోమవారం విజయవాడకు చేరుకుని యూట్యూబ్‌లో పెట్టారు. తనపేరు బయటకు రాకుండా తన చరవాణిలో ఉన్న సన్నివేశాలను చెరిపేశాడు. కృష్ణను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపి, తిరిగి విచారణకు తీసుకొస్తామని ఏసీపీ తెలిపారు. కంప్యూటర్లు మార్చడంతో దొరికాడు: బాహుబలి-2 నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చిత్రనిర్మాత శోభు తెలిపారు. ఒక్కోకంప్యూటర్‌కు ఒక్కో సంకేతపదం ఇచ్చామని, పాత కంప్యూటర్లలోని బాహుబలి సన్నివేశాలను కొత్తవాటిలోకి మారుస్తున్నామని వివరించారు. అవి ఇంకా పూర్తికాకపోవడంతో కృష్ణ సులభంగా తస్కరించాడంటూ స్టూడియో సాంకేతిక నిపుణులు వివరించారన్నారు. సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలను పోలీసులు చెరిపేశారు.

No comments:

Powered by Blogger.