అమెరికాలో తెలుగు ‘పిలుపు’
తొలుత ఒక గంట నిడివితో మొదలైన ఈ చానల్ ప్రసారాలు వాషింగ్టన్ డీసీకే పరిమితమయ్యాయి. గత దీపావళి వరకు అమెరికన్ నెట్‌వర్క్ ద్వారా నాలుగు గంటలపాటు కొనసాగాయి. అమెరికాలోని దేవాలయాలు, అక్కడ జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సమ్మేళనాలు, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రసారాలను అందిస్తున్నారు. ‘కళలే అలలై’ కార్యక్రమం ద్వారా ప్రవాసీయులకు తెలుగు సాహిత్య గుబాళింపులను పరిచయం చేస్తున్నారు. సినీ ప్రియుల కోసం మూవీ ముచ్చట్లు, చిన్నారుల కోసం బుడుగులు-పిడుగులు కార్యక్రమాలనూ అందిస్తున్నారు. ప్రవాసులకు అమెరికాలోని చట్టాలు మొదలైన వాటిపైనా తమ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. వీటిలో నెలల తరబడి మంచు కురిసే ప్రాంతాలున్నాయి. ఈ వాతావరణంలో సీజనల్ వ్యాధుల రక్షణకు ప్రవాసీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. పిలుపు వెబ్‌చానల్ ప్రసారాలతో తెలుగు రాని పిల్లలు కూడా ఇంగ్లీషులో రాసుకొని తెలుగు పాటలు నేర్చుకుంటుండటం విశేషం. త్వరలో అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో గల తెలుగువారి నైపుణ్యాన్ని, ప్రతిభను వెలుగులోకి తెచ్చేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పిలుపు టీవీ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో ఈ ప్రసారాలు చూడవచ్చు. ఇప్పటివరకు రికార్డింగ్ కార్యక్రమాలనే ప్రసారం చేస్తుండగా, భవిష్యత్తులో ఆన్‌లైన్ ప్రసారాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
No comments: