pop

‘రాహుల్ గాంధీ నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు?’


కోల్‌కతా: మనదేశంలో సినిమా స్టార్లు, రాజకీయ నేతల పెళ్లిళ్లకుండే హంగామా అంతాఇంతా కాదు. కొత్త కొత్తగా పుట్టుకొచ్చే పుకార్లు, వాటిని వినేందుకు చెవులు కొరుక్కునే జనాలను చూసి తలపట్టుకున్న ప్రముఖులు చాలామందే ఉన్నారు. తాజాగా అలాంటి వ్యవహారమే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటూ ఓ మహిళ మీడియా ముందు చేస్తున్న హడావిడి చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాహుల్‌ తనను ఎందుకు పెళ్లి చేసుకోవాలో పలు కారణాలను కూడా ఆమె మీడియా ముందు సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ఈ గుర్తుతెలియని మహిళ కాంగ్రెస్ సేవా దళ్ కార్యకర్తగా చెబుతున్నారు. యువనేతకు తన ‘‘ప్రేమను’‘ వెల్లడి చేసేందుకు ఆమె రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముందు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తన ‘కలల రాకుమారుడి’ గురించి చెబుతానంటూ మొదలు పెట్టి... ‘‘దళితులతో సహపంక్తి భోజనం చేయడం.. దళితులకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో రాహుల్‌కి వీరాభిమాని అయ్యాను. నేను ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తినయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్నాను... ఆయన నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు!’’ అని అడిగేసింది. రాహుల్‌ని పెళ్లి చేసుకునేందుకు 2006నుంచే ఆలోచనలు చేస్తున్నానని చెప్పింది. అప్పట్లో తనకు రాహుల్ అంటే చిన్నపాటి నమ్మకమే ఉండేదనీ... అయితే 2014లో పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన పట్ల తన నమ్మకం మరింత బలపడుతూ వచ్చిందని తెలిపింది. అప్పట్నుంచి అనేక కార్యక్రమాల్లో రాహుల్ గాంధీని చూసినట్టు పేర్కొంది. ఇంతకీ రాహుల్‌ని ఎందుకు పెళ్లిచేసుకోవాలనుకుంటున్నావని అడిగితే... ‘‘ఆయన చాలా మంచివాడు.. ప్రధానమంత్రి కొడుకు.. మంచి నాయకుడు.. రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి’’ అని లిస్టు చదవడం మొదలుపెట్టింది. ఆయనేమైనా మాటిచ్చారా ఏమిటని ప్రశ్నిస్తే... ‘‘ముఖా ముఖిగా ఏమీ మాట్లాడలేదుగానీ... తరచూ కలలో కనిపించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఇప్పటికయినా పెళ్లి విషయంలో రాహుల్ ఓ క్లారిటీ ఇస్తే మంచిదంటున్నారు. లేకుంటే ఇలాంటి ప్రతిపాదనలు మరిన్ని రాగలవని సూచిస్తున్నారు.

No comments:

Powered by Blogger.