pop

రెండో తరగతి వరకు.. బ్యాగులొద్దు!


దిల్లీ: రెండో తరగతి వరకూ విద్యార్థులకు స్కూల్‌ బ్యాగు ఉండకూడదని, ఎనిమిదో తరగతి వరకూ పుస్తకాల బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్ని సీబీఎస్‌ఈ పాఠశాలలకు ఆదేశాలు జారీచేసినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. సోమవారం లోకసభలో రాతపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన పిల్లలపై పాఠ్యాంశాల బరువు, పుస్తకాల బరువు తగ్గించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈలు పలు చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తాజాగా 2016 సెప్టెంబర్‌ 12న జారీ చేసిన సర్క్యులర్‌లో కూడా ఇదే విషయం పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విద్య ప్రారంభ దశలో పిల్లలకు పాఠ్యపుస్తకాలు లేకుండా.. ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు రెండు నోట్‌ పుస్తకాలు, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మూడు పుస్తకాలు ఉండేలా ఎన్‌సీఈఆర్‌టీ సిఫారసు చేసిందన్నారు. దీంతో పాటుగా ఎన్‌సీఈఆర్‌టీ సహకారంతోప్రభుత్వం అన్ని పాఠశాలలను డిజిటలైజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. దీనికి సంబంధించి అన్ని పాఠ్యపుస్తకాలు, టీచింగ్‌-లెర్నింగ్‌ మెటీరియల్‌ను ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్లో పెట్టినట్లు కుష్వాహా తెలిపారు. ఉచితంగా దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చన్నారు.

No comments:

Powered by Blogger.