pop

జపాన్‌లో భూకంపం.. సునామీ కలకలం


టోక్యో: ఉత్తర జపాన్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్‌ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అనంతరం తీవ్రత తగ్గడంతో సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. భూకంపం కారణంగా జపాన్‌ రాజధాని టోక్యోలో 30సెకన్ల పాటు భవనాలు వణుకుపాటుకు గురయ్యాయి. దీంతో ఇళ్లల్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా యూఎస్‌ వాతావరణ సర్వే... భూకంప తీవ్రత ప్రారంభంలో 7.4గా ఉన్నా క్రమంగా తగ్గి 6.9గా నమోదైనట్లు తెలిపింది. సముద్రంలో 3మీటర్లకు పైగా అలలు ఎగిసిపడటంతో తాము భయాందోళనలకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ అలలు తమను 2011నాటి సునామీ ఘటనను గుర్తు చేసినట్లు పలువురు తెలిపారు. ఫుకుషిమా న్యూక్లియర్‌ ప్లాంట్‌లోని కూలింగ్‌ సిస్టమ్‌(మూడో రియాక్టర్‌)ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఈ సిస్టమ్‌ను తిరిగి ప్రారంభిస్తామని... అది కూడా తక్కువ ఉష్ణోగ్రత నుంచి క్రమంగా పెంచుతామని.. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేస్తామన్నారు. 2011లో ఇదే ప్రాంతంలో సునామీ రావడంతో తీవ్ర నష్టం జరిగిన కారణంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్లాంట్‌లో ఎలాంటి నష్టం జరగలేదని... కొన్ని సిస్టమ్స్‌ యథావిధిగా పనిచేస్తున్నాయని అన్నారు. ఫుకుషిమా ప్రాంతంలోని ఒనాహమా పోర్టులో సుమారు రెండు అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అలాగే సోమ పోర్టు ప్రాంతంలోనూ 3 అడుగుల మేర అలలు ఎగిసిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం మరో నాలుగు గంటలపాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు బుల్లెట్‌ రైళ్ల రాకపోకలను అధికారులను నిలిపివేశారు. ఇప్పటివరకు జపాన్‌లో వచ్చిన అత్యంత తీవ్రత గల భూకంపాల్లో ఇదీ ఒకటని శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్రానికి 30కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ప్రకటించారు. మొదట తీవ్రంగా వచ్చిన క్రమంగా తగ్గడంతో నష్టం తక్కువ శాతంలోనే జరిగినట్లు చెప్పారు. ఈ ప్రదేశంలో ప్రతి సంవత్సరం 7 తీవ్రతతో భూకంపం సంభవిస్తూనే ఉంటుందని వాతావరణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2011లో సంభవించిన సునామీ కారణంగా సుమారు 18వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు.

No comments:

Powered by Blogger.