pop

భారతీయులకు తీపి కబురునందించిన ట్రంప్


వాషింగ్టన్‌, నవంబరు 23: భారత సంతతికి చెందిన అమెరికన్‌ మహిళ, ప్రస్తుతం సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్న నికీ హేలీ(44)కి ప్రతిష్ఠాత్మకమైన పదవి లభించింది. దేశాధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్‌...ఆమెను ఐరాసలో అమెరికా కొత్త రాయబారిగా నియమించారు. బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. భారత సంతతి మహిళ ఒకరు కేబినెట్‌ హోదాలో నియమితులు కావడం ఇదే ప్రథమం. ‘‘సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా హేలీ ఇప్పటికే సత్తా చాటుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో విజయాలను ఆమె సాధిస్తారని భావిస్తున్నాను. ప్రపంచస్థాయిలో ఆమె అమెరికాకు ప్రాతినిధ్యం వహించబోయే గొప్ప నేత కాబోతున్నారు’’ అని ట్రంప్‌ ప్రశంసించారు. వైట్‌హౌ్‌స్‌లో అధికారం రిపబ్లికన్ల చేతికి వస్తున్న దశలో ట్రంప్‌ తొలి కీలక నియామకం ప్రకటించడం, అదికూడా భారత మహిళ కావడం విశేషం. రైజింగ్‌ స్టార్‌కు పట్టం అమెరికాలో ఆమె ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి. అయినా దౌత్యపరంగా అగ్రస్థానానికి చేరుకోడానికి అది అవరోధం కాలేదు. పట్టుమని ఆరేళ్లు కూడా రాజకీయ అనుభవం లేని భారత సంతతికి చెందిన యూఎస్‌ మహిళ ఐరాసలో రాయబారి కావడం అసాధారణ విషయమే. ఆమే రిపబ్లికన్‌ పార్టీలోని ‘రైజింగ్‌ స్టార్‌’గా గుర్తింపు పొందిన నికీ హేలీ. ప్రస్తుతం సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్న హేలీ తల్లిదండ్రులు పంజాబ్‌ రాష్ట్రం నుంచి చాలా ఏళ్ల క్రితమే అమెరికా వచ్చి స్థిరపడ్డారు. సౌత్ కరోలినా రాష్ట్రానికి రెండో విడత గవర్నర్‌గా పనిచేస్తున్న ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్నారు. హేలీ 2014లో రెండోసారి పోటీచేసి భారీ మెజారిటీతో గెలిచి 24 ఏళ్ల రికార్డును తిరగరాశారు. సిక్కు కుటుంబలో పుట్టిన హేలీ తర్వాత క్రిస్టియన్‌గా మతం మార్చుకున్నారు. ఆర్మీ నేషనల్‌ గార్డు కెప్టెన్‌ మైఖేల్‌ హేలీని పెళ్లాడారు. కాగా ట్రంప్‌ ప్రకటనపై హేలీ హర్షం వ్యక్తం చేశారు. తన నియామకం విన్నాక చలించిపోయానని ఆమె అన్నారు.

No comments:

Powered by Blogger.