pop

నకిలీ నోటుతో బీరు కొని బుక్కయ్యాడు..!


ముంబయి: దేశంలో పెద్ద నోట్లు రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అవస్థలు పడుతున్న వేళ.. కేంద్రం తెచ్చిన కొత్త రూ.2వేల నోట్లతో పలువురు మోసాలకు సైతం పాల్పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరగడం విన్నాం. తాజాగా ముంబయిలోనూ ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు కలర్‌ జెరాక్స్‌ తీయించిన రూ.2వేల నోటుతో మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ బీర్‌ కొనేందుకు ప్రయత్నించగా ఆ నోటుపై అనుమానంతో అప్రమత్తమైన దుకాణం యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. రూ.500, రూ.1000 నోట్లు ప్రభుత్వం రద్దు చేయడంతో కొత్త నోట్లపై ప్రజల్లో నెలకొన్న అయోమయం నేపథ్యంలో యువకుడు కలర్‌ జెరాక్స్‌తో వారిని బోల్తాకొట్టించాలని భావించాడు. అందుకే తన వద్ద ఉన్న రూ.2వేల నోటును కలర్‌ జెరాక్స్‌ తీయించి నకిలీ నోటుతో ఆదివారం రాత్రి విరార్‌ ప్రాంతంలోని ఓ మద్యం దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ బీరు కొనేందుకు ప్రయత్నించగా.. ఆ నోటును పరిశీలించిన స్టోర్‌ మేనేజర్‌ అనుమానంతో దుకాణం యజమాని సుధీర్‌ శెట్టిని అప్రమత్తం చేశాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడ్ని అరెస్టుచేశారు. ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ.. తమ సిబ్బంది పాతనోట్లను తరచూ పరిశీలిస్తుంటారనీ, కొత్తగా వచ్చిన రూ.2వేల నోటుపైనా మరింత అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడున్న రూ.2వేల నోటును పట్టుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తే నకిలీదో, కాదో తెలుసుకోవచ్చని చెప్పారు. కొత్త నోటు పేపర్‌ క్వాలిటీకి నిందితుడు ఇచ్చిన నోటు క్వాలిటీకి ఎంతో తేడా ఉందన్నారు. ఈ ఘటనపై విరార్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ యూనిస్‌ షేక్‌ మాట్లాడుతూ.. నిందితుడిపై కేసు నమోదుచేసి అరెస్టుచేసినట్లు చెప్పారు. తాను ఇచ్చిన రూ.2వేల నోటు నకిలీదేనని నిందితుడు విచారణలో అంగీకరించినట్లు వెల్లడించారు.

No comments:

Powered by Blogger.