pop

బంగరు గౌను... బరువు చెబితే ఏంగానూ..?


రాఘవేంద్రరావు సినిమాలో కథానాయిక అంటేనే చాలా ప్రత్యేకం! పాపిట బిళ్ల నుంచీ పాదాల దాకా... అణువణువూ అందంలో ముంచి తేల్చినట్లుంటుంది. 360 డిగ్రీల్లోని ఏ కోణంలో చూసినా, కొంటె కోణంగిలానే కనిపిస్తుంది. కెమెరా కన్ను ప్రతీ ఒంపునీ ఒడుపుగా కట్టేస్తుంది. వెండి తెరకే సరికొత్త వెలుగులు అద్దుతుంది. అలాంటి కథానాయికలకు మరిన్ని ప్రత్యేకతలు ఎలా దిద్దాలా.. అని ఆలోచిస్తుంటారాయన. ఈసారీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. నాగార్జున హాథీరామ్‌ బాబా పాత్రలో కనిపించనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. ప్రగ్యా జైస్వాల్‌, మధురిమ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవానీ పాత్రలో కనిపించనున్న ప్రగ్యాని మరింత అందంగా చూపించడానికి రాఘవేంద్రరావు సన్నద్ధమయ్యారు. ఆమె కోసం ప్రత్యేకంగా బంగరు వర్ణపు గౌనును తయారు చేయించారు. దీని బరువు ఎంతో తెలుసా? ఏకంగా 14 కిలోలు. దర్శకేంద్రుడి సలహాలూ సూచనలతో ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రుక్మిణి ఈ గౌను తయారు చేశారు. అంత బరువున్న గౌనుతో నాట్యం చేయడానికి ప్రగ్యా ఎంత కష్టపడి ఉంటుందో. మన కళ్లు మాత్రం జిగేల్‌మంటున్నాయి. మరి వెండి తెరపై ఇంకెంత వర్ణరంజితంగా కనిపిస్తుందో.

No comments:

Powered by Blogger.