pop

కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే గర్భం దాల్చావని చెప్పిన డాక్టర్లు..తీరా చూస్తే


చెన్నై: కడుపు నొప్పి కోసం వెళ్లిన ఓ మహిళకు గర్భం దాల్చావంటూ ప్రభుత్వ వైద్యులు చెప్పారు. తొమ్మిది నెలలైనా నొప్పులు రాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించిన ఆ మహిళకు అసలు విషయం తెలిసొచ్చింది. ఆమె కడుపులో వున్నది పసికందు కాదు, కణిత అని తేల్చిన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి తీసేశారు. వివరాల్లోకి వెళితే... స్థానిక కన్నగినగర్‌కు చెందిన అమీర్‌ అలీ, హసీనా (28) దంపతులకు ఏడేళ్లక్రితం వివాహమైనా ఇంతవరకూ సంతానం లేదు. గత ఏప్రిల్‌ మాసంలో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె స్థానిక ట్రిప్లికేన్‌లో వున్న కస్తూరిబాయి ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆమెను పరిశీలించిన వైద్యులు గర్భం దాల్చినట్లు తేల్చారు. దీంతో ఆమె ప్రతి నెలా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటూ వచ్చింది. నవంబరు 18వ తేదీ ‘డ్యూ డేట్‌’ అని వైద్యులు చెప్పినా అలాంటి లక్షణాలేవీ కనబడకపోవడంతో హసీనా ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ స్కాన్ చేసిన వైద్యులు కడుపులో వున్నది బిడ్డ కాదు కణిత అని తేల్చారు. దీంతో ఆమెతో పాటు, కుటుంబీకులు కూడా దిగ్ర్భాంతి చెందారు. అంతేగాక ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. దీనిపై హసీనా కుటుంబసభ్యులు కస్తూరిబా ఆస్పత్రి వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి తెలుసుకున్న కస్తూరిబాయి గాంధీ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ విజయ విలేఖరులతో మాట్లాడుతూ... హసీనాకు ప్రారంభంలో గర్భవతి లక్షణాలే గుర్తించామని, అప్పటి నుంచి ఆమె బలహీనంగా వుండడంతో ప్రధాన చికిత్సలు చేయలేకపోయామని తెలిపారు. అయితే ఆమె కడుపులో చిన్న గడ్డ వున్నట్లు ప్రారంభంలోనే తెలిపామని, అప్పటి నుంచి హసీనా తమ వద్దకు రాలేదని వివరించారు.

No comments:

Powered by Blogger.