pop

చదరపు అడుగు రూ.90కే


దిల్లీ: రిటైల్‌ విపణుల్లో అద్దె పరంగా హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రాంతం అత్యంత అందుబాటులో ఉందని అంతర్జాతీయ స్థిరాస్తి సేవల సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ (సీ అండ్‌ డబ్ల్యూ) తెలిపింది. వాణిజ్య నిర్మాణాల్లో చదరపు అడుగుకు ఇక్కడ నెలవారీ అద్దె రూ.90 మాత్రమే అని సంస్థ తెలిపింది. ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతంలోని ప్రముఖ రిటైల్‌ విపణులను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నివేదిక వెలువరించింది. హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా హిమాయత్‌ నగర్‌ నిలిచింది. ఇక్కడ చదరపు అడుగుకు నెలకు చెల్లించాల్సిన అద్దె రూ.140. ఖరీదైన ప్రాంతంగా ప్రఖ్యాతిగాంచిన బంజారా హిల్స్‌లో అద్దె రూ.130 మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 462 రిటైల్‌ ప్రాంతాల్లోని అద్దెల వివరాలతో ‘మెయిన్‌ స్ట్రీట్స్‌ అక్రాస్‌ ది వరల్డ్‌-2016’ పేరిట సీ అండ్‌ డబ్ల్యూ నివేదికను విడుదల చేసింది. రెండు స్థానాలు కిందకు దిగిన ఖాన్‌మార్కెట్‌: దేశంలో అత్యంత ఖరీదైన వాణిజ్య ప్రాంతంగా దిల్లీలోని ఖాన్‌ మార్కెట్‌ నిలిచింది. ఇక్కడ షాప్‌ పెట్టుకోవాలంటే చదరపు అడుగుకు నెలకు రూ.1,250 అద్దె చెల్లించాలి. అందుకే ప్రపంచంలో 28వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే మాత్రం రెండు స్థానాలు దిగజారింది. అంత మాత్రాన అద్దెలు తగ్గాయని భావిస్తే పొరపాటే.. ఇతర దేశాల్లో అద్దెలు పెరగడం వల్ల ఖాన్‌ మార్కెట్‌ ర్యాంకు తగ్గిందంతే. ఆసియా ఫసిఫిక్‌ దేశాల్లో దిల్లీ ఖాన్‌ మార్కెట్‌ 15వ స్థానంలో నిలిచింది. వ్యాపారానికి అత్యంత అనువైన ప్రాంతంలో ఉండటం వల్ల ఖాన్‌ మార్కెట్‌కు గిరాకీ పెరుగుతోంది. చుట్టు పక్కల సంపన్నుల నివాసాలు ఉండటం కూడా ఇందుకు మరో కారణం. అందువల్ల గత అయిదేళ్లుగా ఈ ప్రాంతం హవా ఏ మాత్రం తగ్గడం లేదు. మరో వాణిజ్య ప్రాంతం కన్నాట్‌ ప్లేస్‌ చ.అ. అద్దె రూ.850తో దేశంలో రెండో స్థానంలో నిలబడింది. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ గలేరియాలో అద్దె రూ.800 కాగా, దేశీయంగా మూడో స్థానంలో నిలిచింది. మొదటిస్థానంలో న్యూయార్క్‌: షాపుల అద్దెల విషయంలో అమెరికాలోని న్యూయార్క్‌ ప్రపంచంలోనే తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడి ‘అప్పర్‌ ఫిప్త్‌ ఎవెన్యూ’లో షాపు తెరవాలంటే ఏడాదికి 3,000 డాలర్లు చెల్లించాలంట. 2,878 డాలర్లతో హాంకాంగ్‌లోని కాజ్‌వే బే రెండో స్థానాన్ని దక్కించుకుంది. పారిస్‌లోని అవెన్యూ డెస్‌ చాంప్స్‌ ఎలిసీస్‌ (1,368 డాలర్లు), లండన్‌లోని న్యూ బాండ్‌ స్ట్రీట్‌ (1,283 డాలర్లు), టోక్యోలోని గింజా (1,249 డాలర్లు) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. గణనీయమైన మార్పులు.. దేశీయ స్థిరాస్తి రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని సీ అండ్‌ డబ్ల్యూ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) అన్షుల్‌ జైన్‌ అన్నారు. శరవేగంతో విస్తరిస్తున్న ఇ-కామర్స్‌ విపణి, సంప్రదాయ రిటైల్‌ షాపులకు సవాళ్లు విసురుతోందని వివరించారు. ప్రస్తుతం ఉన్న వాణిజ్య ప్రాంతాల్లో చాలా వరకు ఖాళీలు లేవని పేర్కొన్నారు.

No comments:

Powered by Blogger.