ఆ హీరోయిన్ మళ్లీ బుల్లితెరకే?
ఆమె మొదట్లో టీవీ యాంకరే. ఓ పాపులర్ టీవీ ఛానెల్‌లో చాలా కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. అలా బుల్లితెర మీద ఆమెను చూసిన రవిబాబు ‘నచ్చావులే’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు. ఆ సినిమా సూపర్‌హిట్ అవడంతో ఆమె దశ తిరిగిపోతుందనుకున్నారు అంతా. అయితే ఆమె తర్వాతి చిత్రం నానీ హీరోగా వచ్చిన ‘స్నేహితుడా’ మాత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత ఏవో కొన్ని అవకాశాలు వచ్చినా.. ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆమె ఎవరో కాదు.. మన తెలుగమ్మాయి మాధవీలత. వెండితెర మీద విజయవంతం కాలేకపోయిన మాధవీలత మళ్లీ బుల్లితెరపై కనిపించడానికి సిద్ధమవుతోందట. ఓ ఛానెల్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పుడు బుల్లితెరను కూడా తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు. రష్మీ, అనసూయ, శ్రీముఖి లాంటి బుల్లితెర యాంకర్లకు తెలుగునాట హీరోయిన్లతో సమానమైన పాపులారిటీ ఉంది. అందుకే ఇకపై బుల్లితెరను సీరియస్‌గా తీసుకోవాలని డిసైడ్ అయిందట మాధవీలత. అక్కడ సత్తా చాటి ఆ తర్వాత వెండితెర తలుపు తట్టాలనే కృతనిశ్చయంతో ఉందట.
No comments: