pop

భారత్ అర్జెంటుగా చేయాల్సిన పనేంటో చెప్పిన చైనా


బీజింగ్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంపై పొరుగు దేశం చైనా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ అర్జెంటుగా తన రైల్వేను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అందుకు చైనా పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొంది. ఆదివారం జరిగిన ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 140 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. భారత్ రైల్వే నెట్‌వర్క్ చాలా అధ్వానంగా ఉందని చైనా అధికారిక పత్రిక పేర్కొంది. భారత్ వీలైనంత త్వరగా రైల్వేలను అప్‌గ్రేడ్ చేసుకోవాలని, అందుకు కావాల్సిన సాయం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ ఓ కథనంలో పేర్కొంది. ‘‘ఇండోర్-పట్నా రైలు ప్రమాదం నేపథ్యంలో మౌలిక సదుపాయాలపై ఇండియా-చైనా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. భారత రైల్వేలను అప్‌గ్రేడ్ చేసేందుకు చైనా నేరుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది’’ అని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. చైనా సారథ్యంలోని ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో భారత్‌ రెండో అతిపెద్ద షేర్లు కలిగి ఉంది. అలాగే ఓటింగ్ హక్కులు కూడా ఉన్నాయి. ఆసియాలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆ బ్యాంకు నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొంది. ‘‘చైనా సంస్థలను రైల్వేలో పెట్టుబడులకు అనుమతిస్తే భారత్‌కు రుణం ఇచ్చేందుకు చైనా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి’’ అని పేర్కొంది. అభివృద్ధి చెందిన చాలా దేశాలతో పోలిస్తే రైల్వే సాంకేతికతలో చైనా చాలా ముందు ఉందని, ఖర్చు కూడా చాలా తక్కువ అని తెలిపింది. రైల్వే టెక్నాలజీలో భారత్, చైనాలు పరస్పరం సహకరించుకునే అవకాశం ఉందని వివరించింది.

No comments:

Powered by Blogger.