pop

వీళ్లసలు మనుషులేనా... అత్యంత అమానుష ఘటన


వైద్యో నారాయణో హరి అని అంటుంటారు. డాక్టర్లను దైవ సమానులుగా భావించి చేతులెత్తి నమస్కారం చేస్తుంటారు. ఇంతటి గౌరవం కలిగిన, పవిత్రమైన వైద్య విద్యనభ్యసిస్తున్న కొందరు మెడికోలు రానురాను సైకోలుగా మారుతున్నారు. చెన్నైలో ఓ మెడికో స్టూడెంట్ కుక్కను పైనుంచి విసిరేసి, అదంతా వీడియో తీసి పైశాచిక ఆనందం పొందిన ఘటన గురించి వినే ఉంటారు. ఈ ఘటన మరువక ముందే వెల్లూరులోని క్రిష్టియన్ మెడికల్ కాలేజ్‌ హాస్టల్‌లో మెడిసిన్ చదువుతున్న నలుగురు స్టూడెంట్స్ ఓ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ కోతి పిల్లను కాళ్లు కట్టేసి, బెల్టుతో కొట్టి చిత్రవధకు గురిచేశారు. అంతటితో ఆగకుండా దాని చర్మం చీల్చేసి ఏదో గొప్ప పని చేసినట్లుగా గంతులేసి పైశాచికంగా ప్రవర్తించారు. ఇలా కొద్దిసేపు కోతికి నరకం చూపించి, చివరికి ఆ నోరులేని మూగజీవాన్ని కిరాతకంగా చంపేశారు. దాన్ని తీసుకెళ్లి హాస్టల్ సమీపంలోని రోడ్డు పక్కన పూడ్చి పెట్టారు. ఈ ఘటన నెటిజన్లను కలచివేసింది. ఆ నలుగురు విద్యార్థుల చర్యను తీవ్రంగా ఖండించారు. కఠిన శిక్ష పడేలా చూడాలని సూచించారు. చెన్నైకి చెందిన శ్రవణ్ క్రిష్ణన్ అనే జంతు ప్రేమికుడు ఈ విషయాన్ని తెలుసుకుని తీవ్రంగా బాధపడ్డాడు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి కోతిని ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకుని అక్కడ తవ్వారు. గొయ్యిలో కాళ్లు కట్టేసి ఉన్న ఆ మూగజీవాన్ని చూసి ఆ కాలేజీకి చెందిన విద్యార్థులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై క్రిష్ణన్ కాలేజీ ప్రిన్సిపల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఆ నలుగురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Powered by Blogger.