pop

రేపే ప్రధాని రాక


రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ వస్తున్నారు. జాతీయ స్థాయి డీజీపీల సదస్సులో శనివారం పాల్గొనే ఆయన, అదే రోజు సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళ్తారు. ప్రధాని వెంట హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్‌తో పాటు, పలువురు అధికారులు నగరానికి వస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ శిక్షణా కేంద్రం (ఎనపీఏ)లో అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు వచ్చే ప్రధాని బృందం రోడ్డు మార్గంలో ఎన్‌పీఏ చేరుకుంటుంది. ఆ రాత్రి వారు అక్కడే బస చేస్తారు. కాగా, మూడు రోజుల జాతీయ స్థాయి డీజీపీల సదస్సు శుక్రవారం ఎన్‌పీఏలో ప్రారంభం అవుతోంది. రెండోరోజున శనివారం ఉదయం ప్రధాని ఆ సమావేశానికి హాజరవుతారు. సదస్సు సందర్భంగా ఎనపీఏ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అకాడమీ డైరెక్టర్‌ అరుణా బహుగుణ, డీజీపీ అనురాగ్‌ శర్మ వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మరోవైపు సీఎస్‌ రాజీవ్‌శర్మ కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని హెచఎండీఏ, జీహెచఎంసీని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లపై వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం వద్ద సమావేశమైన సైబరాబాద్‌ అధికారులు పోలీసులకు సూచనలిచ్చారు.

No comments:

Powered by Blogger.