pop

రూ.2000నోటు మార్పిడికి 70కిలోమీటర్ల నడక


రూ.2000నోటు మార్పిడికి 70కిలోమీటర్ల నడకఓ రైతు తన వద్ద ఉన్న రూ.2000ల నోటును మార్పిడి చేసుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నాలుగు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి దాదాపు 70కిలోమీటర్లు నడిచి మరీ ఆ నోటును మార్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. బుందేల్ఖండ్కు చెందిన రైతు బీహారీదాస్ వద్ద రూ.2000 నోటు ఉంది. దాన్ని చిల్లరగా మార్చి వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా భారీ క్యూ కనిపించడం, డబ్బులు అయిపోవడంతో ఇక లాభం లేదని దాదాపు 70 కిలోమీటర్లు నడిచి మరీ రూ.2000 నోటును మార్పిడి చేసుకున్నాడు. ఈ సందర్భంగా బీహారీదాస్ మాట్లాడుతూ రూ.2000నోటును మార్చడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని చెప్పారు. ఇదిలాఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలు నోట్ల మార్పిడికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బీజేపీ నేత గాలి జనార్దన్రెడ్డి తన కూతురు వివాహానికి రూ. 500 కోట్లు ఎలా ఖర్చు చేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఓ ఆంగ్ల టెలివిజన్ చానెల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకపక్క సామాన్య ప్రజలు చస్తుంటే రూ.500 కోట్లను గాలి జనార్దన్ రెడ్డి ఎలా మార్చుకొన్నారని అన్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ బిల్లు పుస్తకాలపై స్టాంపులు వేస్తున్న ఆదాయం పన్ను అధికారులు గాలి పుస్తకాలను ఎందుకు తనిఖీ చేయలేదని నిలదీశారు. కేవలం రూ.2.5 లక్షలతో సామాన్యుడి ఇంట్లో పెళ్లి జరుగుతుందా అని కేజ్రీ ప్రశ్నించారు. నల్లధనాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు కొత్త నోట్లను హోం డెలివరీ చేశారు. పన్ను ఎగవేతను ప్రభుత్వం అడ్డుకొంటే చాలా గొప్ప విషయమే. అందుకు రాత్రికి రాత్రే నియంతగా మారాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని కేజ్రీవాల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలతో సంబంధాలు కోల్పోయిందని, ఒక్కసారిగా తీసుకొన్న నిర్ణయంతో ప్రజలు అభద్రతాభావానికి గురయ్యారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడం, దాని వల్ల కలుగుతున్న ఇబ్బందులపై కనీసం సమీక్ష జరుపడానికి నిరాకరించడం దురదృష్టకరమని ఆయన ట్వీట్ చేశారు. అత్యంత దారుణమైన నిర్ణయానికి మోదీ భక్తులు వంత పాడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. అలాంటి వారిని చూసి భయపడొద్దు. వారి నోళ్లను మూయించడానికి దీటైన సమాధానం చెప్పండి అని ట్వీట్లో పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోమబోమని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ విధంగా స్పందించారు.

No comments:

Powered by Blogger.