pop

మద్యం వద్దు...రసగుల్లా ముద్దు


మద్యనిషేధం అమలుతో ఊపందుకున్న రసగుల్లా విక్రయాలు పెరిగిన పాల విక్రయం రాష్ట్రంలో తగ్గిన నేరాలు పాట్నా : బీహార్ రాష్ట్రంలో మద్యనిషేధం అమలుతో రసగుల్లా విక్రయాలు జోరందుకున్నాయా అంటే అవునంటున్నారు సాక్షాత్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్ రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేసిన తర్వాత గడచిన ఏడునెలల కాలంలో రసగుల్లా విక్రయాలు 16.25 శాతం పెరిగాయని సీఎం నితీష్ కుమార్ తాజాగా వెల్లడించారు. నిశ్చయయాత్రలో భాగంగా తూర్పు చంపారన్ జిల్లాలో చేతన సభలో సీఎం ఈ విషయం చెప్పారు. మద్యాన్ని నిషేధించాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాలైన స్వీట్లు, పన్నీరు, పెరుగు విక్రయాలు గణనీయంగా పెరిగాయని సీఎం వెల్లడించారు. దీనికితోడు రాష్ట్రంలో పాల అమ్మకాలు కూడా 11 శాతం పెరిగాయని చెప్పారు. మద్యనిషేధాన్ని అమలు చేయడంతోపాటు వచ్చే ఐదేళ్లలో అందరి చెంతకు మంచినీరు, మరుగుదొడ్డి, రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నితీష్ కుమార్ వివరించారు. మద్య నిషేధం అమలుతో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని చెప్పారు. గృహహింసతో పాటు హత్యా సంఘటనలు 36 శాతానికి తగ్గాయన్నారు. మద్య నిషేధం ప్రభావం వల్ల దోపిడీలు 25 శాతం, దాడులు 40 శాతం, కిడ్నాప్ లు 56 శాతం, రోడ్డు ప్రమాదాలు 21 శాతం తగ్గాయని సీఎం వివరించారు.

No comments:

Powered by Blogger.