pop

400 ఏళ్ల క్రితమే కృత్రిమ బంగారు దంతాలు


లండన్: వైద్యశాస్త్రం నాలుగు వందల ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందినట్టు తాజాగా లభ్యమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇటలీలోని లుక్కాకు సమీపంలో టుస్కాన్ వద్ద పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో నాలుగు దశాబ్దాల నాటి కృత్రిమ దంతాలు బయటపడ్డాయి. మొత్తం ఐదు పళ్లు కలిగిన దవడ తవ్వకాల్లో బయటపడగా అందులో మూడు ముందరి పళ్లు కాగా రెండు పక్కవి. అయితే వాటి అమరిక సరిగ్గా లేదు. మరో విశేషం ఏమంటే ఆ పళ్లకు బంగారు తొడుగులు ఉండడం. పళ్లను ఎంతో నేర్పుగా తొలగించి వాటికి బంగారు రేకు తొడిగి అనంతరం వాటిని తిరిగి జాగ్రత్తగా పళ్ల సందుల్లో అమర్చారని ఇటలీలోని పిసీ యూనివర్సిటీకి చెందిన సిమోనా, వాలెంటినా గియుఫ్రా‌లు తెలిపారు. ప్రతీ పన్నుకు సూక్ష రూపంలో ఉన్న బంగారు పిన్నులు ఉన్నట్టు సీటీ స్కానింగ్‌లో వెల్లడైనట్టు పేర్కొన్నారు. పళ్లకు తొడిగిన బంగారం రేకులో 73 శాతం బంగారం, 15.6 శాతం వెండి, 11.4 శాతం రాగి ఉన్నట్టు పరిశోధనకారులు గుర్తించారు. వదులైన పళ్లను తిరిగి నిలబెట్టేందుకు కొన్ని గృహోపకరణాలను ఉపయోగించేవారని ఫ్రెంచ్ సర్జన్ ఆంబ్రోయిస్ పారె(1510-1590) పేర్కొన్నారని పరిశోధనకారులు తెలిపారు. పలువురు ప్రెంచ్ రాజులకు ఆంబ్రోయిస్ రాజ వైద్యుడిగా సేవలు అందించారు. మరో వైద్యుడు పియెర్రె ఫాచర్డ్(1678-1761) కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక దంత వైద్యానికి ఫాచర్డ్‌ను పితామహుడిగా వ్యవహరిస్తారు. అయితే వారు పేర్కొన్న పరికరం లాంటి దానిని ఇప్పటి వరకు కనుగొనలేదు. ప్రస్తుతం బయటపడిన కృత్రిమ దంతాలు అప్పట్లోని దంత వైద్యశాస్త్ర పరిజ్ఞానికి ప్రత్యక్ష ఉదాహరణ అని పరిశోధనకారులు తెలిపారు.

No comments:

Powered by Blogger.