pop

తప్పిపోయిన చిన్నారుల జాడ తెలుసుకునేందుకు వినూత్న ఆలోచన..!


మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు తప్పి పోతే మనకు ఎంత కంగారుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముందుగా అన్ని చోట్ల వెదికి, అయినా ఫలితం లేకపోతే పోలీస్ కంప్లయింట్ ఇస్తాం. అయినప్పటికీ చిన్నారి దొరక్కపోతే ఇక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. మరి, అలా తప్పిపోయిన చిన్నారి ఒక వేళ మళ్లీ దొరికితే, అప్పుడు ఆనందం రెట్టింపు అవుతుంది. అదిగో. అలాంటి ఆనందాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడం కోసమే చైనాకు చెందిన ఓ సంస్థ తప్పిపోయిన చిన్న పిల్లలను వెదికి తెచ్చిపెట్టే పనిలో పడింది. అందుకు ఆ సంస్థ ఏం చేస్తోందో మీకు తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..! చైనాలోని కింగ్‌డావో కింగ్‌టెక్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ బావోబెయ్‌హుయ్‌జియా (బేబీ బ్యాక్ హోమ్‌) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. అదేమిటంటే. తప్పిపోయిన చిన్నారుల పేరు, ఫొటో, వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్ వంటి వాటిని ప్రింట్ చేసి ఆ కాగితాలను వాటర్ బాటిల్స్‌కు అంటించి సూపర్ మార్కెట్లు, ఎయిర్ పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లలో విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఒక వేళ ఎవరైనా ఆ పిల్లల ఫొటోలను చూసి గుర్తు పడితే గనక వెంటనే ఆ బాటిల్‌పై ఇవ్వబడిన నంబర్లకు ఫోన్ చేసి వారి సమాచారాన్ని తెలియజేయవచ్చు. అలా ట్రేస్ అయిన చిన్నారులను సదరు కింగ్‌డావో సంస్థ వారి తల్లిదండ్రులకు అప్పగిస్తుంది. 2007లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభంగా ఇప్పటి వరకు 1700 మంది పిల్లలను అలా ట్రేస్ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పుడు వారి ముఖాల్లో కలిగిన ఆనందం చెప్పలేనిది. అయితే సదరు కింగ్‌డావో సంస్థ ఇంకా అలాంటి 31వేల పిల్లలను వెదకాల్సి ఉందట. అయినా వారి జాడను కచ్చితంగా తెలుసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. చైనాలో ఏటా కొన్ని లక్షల సంఖ్యలో చిన్నారులు అదృశ్యమవుతున్నారట. అలా కనిపించకుండా పోయిన వారు బిచ్చగాళ్లుగా లేదంటే ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో కొందరు వ్యక్తులచే వాడుకోబడుతున్నారట. దీంతో అలాంటి బాలలను తగ్గించడం కోసమే ఆ సంస్థ ఈ పనిచేస్తోంది. అయితే మన దేశంలోనూ ఏటా 1.70 లక్షల మంది పిల్లలు తప్పిపోతున్నారట. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అక్కడ ఏటా 50వేల మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారట. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అయితే అలా తప్పిపోయిన చిన్నారుల్లో ఎక్కువ శాతం బాలికలే కావడం గమనార్హం. వారిని కొందరు వ్యక్తులు బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారట. ఇంకొందరిని వేశ్యావృత్తిలోకి దింపుతున్నారట. దీంతో మన దేశంలో కూడా చైనాలోలాగే చేస్తే దాంతో కొందరు పిల్లలైనా ట్రేస్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వినూత్న ఆలోచన చేసిన సదరు కింగ్‌డావో సంస్థను అభినందించాల్సిందే కదా..!

No comments:

Powered by Blogger.