pop

మనవాళ్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా?!


అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. బాధ్యతలు చేపట్టనున్నారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్న తరుణంలో స్వదేశంలో ఆయన ప్రత్యర్థులు తమ భవిష్యత్తును తలచుకుని ఉలిక్కిపడుతుంటే.. మరోవైపు ఇటు భారతీయులు అటు చైనీయుల్లో కూడా గుబులు మొదలైంది. పలు సందర్భాల్లో డోనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని, పనిలో పనిగా చైనాను టార్గెట్ చేస్తూ మాట్లాడిన సంగతి గుర్తుచేసుకుని వణికిపోతున్నారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే చేసే తొలి పని ఆ దేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయులను బయటకు గెంటేయడమేనని అంటున్నారు. భారతీయుల వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన పలు మార్లు ఆక్రోశించిన సంగతి తెలిసిందే. అమెరికాలో నిరుద్యోగాన్ని అంతమొందించాలంటే ఆ దేశంలో తిష్టవేసిన భారతీయులను చైనీయులను తరిమేయాల్సిందేనంటూ స్థానిక అమెరికన్ యువతలో కదలిక తెచ్చేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నారు. నోటిదురుసు వ్యక్తిగా, నోటికి ఇష్టం వచ్చినట్లు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మీడియాలో ఆయన పట్ల వ్యతిరేకంగా కథనాలు వచ్చినప్పటికీ వాటి ప్రభావం అక్కడి ఓటర్లపై పడలేదని ఆయన విజయం రుజువు చేస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతటి నోటి దురుసు వ్యక్తిగా పేరొందినప్పటికీ ట్రంపులో అమెరికన్లకు న్యాయం చేయాలనే ఆశ, పట్టుదలను స్థానిక ఓటర్లు చూశారు. అమెరికా ఎంతటి అగ్రరాజ్యమైనప్పటికీ ఆ దేశంలో నిరుద్యోగుల శాతం అధికంగానే ఉంది. నిరుద్యోగులకు ట్రంప్ ప్రచారం ఆశలు కల్పించింది. తాను పవర్లోకి వస్తే ఇకపై భారతీయులు, చైనీయుల ఆటలు సాగవని, వారు అమెరికన్ల నుండి ఉద్యోగాలను తన్నుకుపోనీయనన్న ఆయన మాటలు అమెరికన్ యువతను కట్టిపడేసాయి. దానికితోడు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టే విషయంలో కూడా ట్రంప్ తనదైన శైలిలో పరిష్కారాలను ప్రకటించడం కూడా వారిని ఆకట్టుకుంది. అమెరికా జనాభాలో భారతీయుల సంఖ్య 2010 జనాభా లెక్కల ప్రకారం 2,843,391. వీరందరి వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు కరవవుతున్నాయని ట్రంప్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం ప్రపంచంపై ముఖ్యంగా భారతీయులపై ఎలా ఉంటుందనే దాని గురించి స్పష్టత రావడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. ఈలోపు మాత్రం భారతీయుల్లో గుబులు తప్పదు. ఊ.. అంటే అమెరికా వైపు ఆశగా ఎదురుచూస్తూ.. అవకాశం వస్తే విమానమెక్కేయడానికి సిద్ధం అన్నట్లుండే భారతీయుల ధోరణి ట్రంప్ పుణ్యమా అంటూ మారుతుందా.. లేక వారు అమెరికాపై ఆశలు వదులుకుని దాని స్థానంలో వేరే దేశాలకు క్యూలు కడతారా అనేది తరువాత తేలుతుంది. ట్రంప్ భారతీయులను టార్గెట్ చేస్తూ ఎన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ, వాటిని ఆచరణలో పెట్టడం కూడా ఆయనకు కష్టం కావచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అమెరికాకు పెద్ద ఎత్తున ఐటీ సేవలు అందించే భారతీయులు, భారతీయ సంస్థలు లేనిదే అమెరికా ఆర్థిక వ్యవస్థ మనడం కష్టమని, ఆయన హెచ్చరికలు కేవలం ఎన్నికలకే పరిమితమని చెపుతున్నారు.

No comments:

Powered by Blogger.