pop

నాజూకు నడుమెందుకో తెలుసా?


కలకాలం ఇలా సాగనీ అని అనుకుంటూ ఉంటారు. ఎప్పటికీ బాల్యంలోనే ఒదిగిపోవాలనుకుంటారు. కవ్వించే యవ్వనం నిగనిగలాడుతూ కొనసాగాలనుకుంటారు. వ్యాయామాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ అందం కోసం శ్రమిస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా వినిపించుకోరు. ప్రతిభాపాటవాలు, పేరు ప్రతిష్ఠలు, సంపద ఉన్నవాళ్ళు మేని సౌందర్యం కోసం తహతహలాడటం మానుకోవడం లేదు. 30 నుంచి నలభయ్యేళ్ళ వయసులో ఉన్నవాళ్ళు కూడా తాము బిడ్డల తల్లులైనా సొగసుదనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీంతో వారి కాళ్ళు, భుజాలు, వక్షోజాలు, తొడలు బాగా సన్నబడిపోయి, చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. అలెక్సా చుంగ్ 33 ఏళ్ళ వయసులో చాలా చిన్న పిల్లలా కనిపిస్తోందట. అమల్ క్లూనీ అయితే పెళ్ళినాటికే నాజూకు నడుముతో కనిపించేదట. ఇప్పుడు 38 ఏళ్ళ వయసులో ఇంకా సన్నబడి చాలా బరువు తగ్గిందట. ప్రముఖ నటి కేట్ బోస్‌వర్త్ 33 ఏళ్ళ వయసులో ఎముకలకు చర్మం అతుక్కుపోయినట్లు కనిపిస్తోందట. ప్రముఖ మోడల్ 26 ఏళ్ళ జోర్డాన్ డున్ నడుము 24 అంగుళాల నడుముతో సన్నజాజి తీగలా వయ్యారాలు పోతోందట. నలభయ్యేళ్ళ అన్నా ఫ్రియెల్ బక్కపలచగా ఎనిమిదేళ్ళ బాలికలా కనిపిస్తోందట. నటి అలిసియా వికాందర్‌కు 28 ఏళ్ళు నిండినా ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగిడుతున్న బాలికలా ఉందట. ఫ్యాషన్ డిజైనర్ లారా బెయిలీ 44 ఏళ్ళ వయసులోనూ వహ్వా! ఏం ఫిగర్ అనిపించుకుంటోందట. ఈ సెలబ్రిటీలు వయసుకు తగినట్లు ఎదగలేదని విమర్శకులు చెబుతున్నారు. వాళ్ళు యుక్తవయసుకు రాని పిల్లల్లా ఉన్నారంటున్నారు. కొందరు స్టార్లు ఎనిమిదేళ్ళ బాలల నడుము సైజుతో కనిపిస్తున్నారని, క్యాట్‌వాక్ మోడల్స్‌ నడుములను అనుకరిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. నడుము చుట్టుకొలత 24 అంగుళాల కన్నా మించకుండా జాగ్రత్త పడుతూ వ్యాయామాలు చేస్తున్నారంటున్నారు. అయితే ఈ స్థాయిలో కష్టపడటం వల్ల ఎముకలు, సంతానోత్పత్తి సామర్థ్యంపై దుష్ప్రభావం పడుతుందని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ మహిళలకు భిన్నంగా కనిపించాలన్న తహతహ ఎక్కువవుతుండటం వల్లే స్టార్లు చిన్న పిల్లల శరీరాకృతిని కోరుకుంటుండటానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఎముకలకు చర్మం అతుక్కుపోయి ఉండటం సుసంపన్నతకు నిదర్శనమని, బక్కపలచగా ఉండటం గౌరవానికి గుర్తుగానూ, ఏ-లిస్ట్ విజయాలకు దగ్గరి దారిగానూ వాళ్ళు భావిస్తున్నారని చెప్తున్నారు. విశేషం ఏమిటంటే... వీళ్ళు తినే ఆహారం చాలా ఖరీదైనదట!

No comments:

Powered by Blogger.