pop

కూర్చోబెట్టి జీతం ఇస్తూ ఉంటే పని చెప్పాలని కేసు పెట్టాడు


మన్‌హటన్ : టీచర్ జాబ్ వస్తే ఎంతో హాయిగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఏవో రెండు క్లాసులు చెప్పి.. దర్జాగా కూర్చోవచ్చని భావించేవాళ్లు ఉంటారు. కానీ డేవిడ్ సూకర్ (48) అనే టీచర్ మాత్రం వీరిలాంటి వారికి భిన్నం. అతడికి 94 వేల డాలర్ల (62 లక్షల 75 వేల 12 రూపాయలు ) జీతం. అతడి పనల్లా రోజంతా ఏ పనీ లేకుండా తిని, కూర్చుంటూ జీతం తీసుకోవడమే. ఇలాంటి ఉద్యోగం ఉందంటే ఎగిరిగంతేసే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ సూకర్ మాత్రం తనకు ఈ జాబ్ ఇష్టం లేదంటున్నాడు. తనకు పని చెప్పాలని కేసు పెట్టాడు. ‘‘నేను పని చేయాలని రోజూ ‘ది బ్రాంక్స్‌’ స్కూలుకు వస్తున్నాను. కానీ ఏమీ చేయకుండా కూర్చుంటున్నాను’’ అని సూకర్ చెప్పాడు. తనను ఆబ్సెంట్ టీచర్ రిజర్వు (ఏటీఆర్)లో ఉంచుతున్నారని ఫిర్యాదు చేశాడు. మన్‌హటన్ విద్యా శాఖ నిబంధనల ప్రకారం శాశ్వత ప్రాతిపదికన నియమితులు కాని, దుష్ప్రవర్తనగల టీచర్లను ఏటీఆర్‌లో ఉంచుతారు. పాఠశాలలను కుదించినప్పుడు మిగిలిపోయే టీచర్లను కూడా దీనిలోనే ఉంచుతారు. వీరికి జీతం, తదితర ప్రయోజనాలన్నీ లభిస్తాయి. ప్రస్తుతం దీనిలో 1,304 మంది టీచర్లు ఉన్నారు. వీరి కోసం సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చవుతోంది. డేవిడ్ సూకర్ ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ నిరసనలో పాల్గొని ఓ పోలీసు అధికారితో ఘర్షణ పడ్డాడు. 7 వేల డాలర్లు జరిమానా చెల్లించి ఆ కేసు నుంచి బయటపడ్డాడు. విద్యా శాఖ అంతకుముందు ఆయన చేసిన ఉద్యోగాన్ని ఇవ్వడానికి బదులు ఏటీఆర్‌కు పంపించేసింది. ఏటీఆర్‌లో ఉన్న టీచర్లు ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. తమకు నైపుణ్యం ఉన్న సబ్జెక్టులను బోధించే అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. సూకర్ ఏటీఆర్ సిస్టమ్‌పై మన్‌హటన్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాడు. టీచర్లకు ఇటువంటి మితిమీరిన శిక్ష విధించే అధికారం విద్యా శాఖకు లేదని వాదించాడు. ఈ సిస్టమ్‌లోకి వెళ్ళిన టీచర్లపై కళంకం పడుతోందని ఆరోపించాడు. దీనిపై విద్యా శాఖ స్పందిస్తూ తప్పు చేసిన టీచర్లను ఏటీఆర్‌కు పంపించే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది. ప్రిన్సిపాల్ అంగీకరిస్తేనే మళ్ళీ విధుల్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. జడ్జి అలిస్ ష్లెసింగర్ త్వరలో తుది తీర్పును త్వరలో ప్రకటిస్తారు.

No comments:

Powered by Blogger.