pop

వేధించారుగా.. వెళ్లి రోడ్లు ఊడ్వండి!


ఈ ఆదివారం నాడు ముంబైలోని ఒక ప్రాంతంలో ఐదుగురు యువకులు చేతులతో చీపుర్లు పట్టుకుని రోడ్లను ఊడ్చుతున్న దృశ్యం అటుగా వెళ్తున్న వారిని ఆకర్షించింది. వారు పారిశుద్ధ్య కార్మికులు కాదు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా కోర్టు వారిని రోడ్లు ఊడవాలని ఆదేశించింది. వారిలో ఒకడు తప్పించి మిగిలిన వారంతా పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా లేని మైనర్లు.. అంతా కలిసి మరో మైనర్ బాలికను లైంగిక వేధింపులతో సమానమైన చేష్టలతో వేధించారు. ఇంటి నుండి తరగతికి, అక్కడి నుండి ఇంటికి వచ్చీ పోయే సమయంలో ఆమెను వెంటాడుతూ ప్రతీరోజు సూటిపోటి మాటలతో విసిగించారు. చివరకు వారి వేధింపులకు విసిగిన ఆ బాలిక పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు ఆ ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో తమ తప్పును ఒప్పుకున్న మైనర్లు ఇకపై అలాంటి పనులు చేయబోమంటూ లెంపలు వాయించుకున్నారు. తమకు శిక్షలు విధిస్తే భవిష్యత్ నాశనం అయిపోతుందని, మన్నించి వదిలివేయాలంటూ న్యాయస్థానాన్ని బతిమాలుకున్నారు. చివరకు కోర్టు మానవతా దృక్పథంతో స్పందించింది. ఆ బాలిక తల్లితండ్రులతో విషయాన్ని వివరించింది. వారు చేసిన తప్పును పెద్ద మనసుతో బాలిక తల్లితండ్రులు మన్నించారు. ఆ బాలిక కుటుంబంతో పాటు సదరు మైనర్ల కుటుంబాలన్నీ ఒకే ప్రాంతంలో పక్కపక్క ఇళ్లలో నివాసముంటుంటాయి. ఆ బాలిక తొలుత అక్కడున్న 21 ఏళ్ల యువకుడితో కలిసి ఇంటినుండి వెళ్తూ కోచింగ్ సెంటర్లో తరగతులకు హాజరయ్యేది. కానీ, ఆ తరువాత ఆమె వేరొక మైనర్ బాలుడితో స్నేహపూర్వకంగా మెలగసాగింది. అది గిట్టని ఆ యువకుడు మిగిలిన మైనర్లతో కలిసి ఆమెపై వేధింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

No comments:

Powered by Blogger.