pop

నల్ల కుబేరులు.. మహా ముదుర్లు..


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనంపై చేస్తున్న పోరాటం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఏమో గానీ, నల్ల కుబేరులు మాత్రం మహా ముదుర్లని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గతంలోనే స్పష్టం చేశారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు మోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తూ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా నోట్ల రద్దుతో పెద్దగా ప్రయోజనం ఉండదని 2014 ఆగస్ట్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. నేటి ఆధునిక యుగంలో నల్ల కుబేరులు చాలా తెలివైనవారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగా నోట్ల కట్టలను పోగేసుకోవడం చాలా తక్కువని, చాలా మంది నల్ల ధనాన్ని చిన్న చిన్నగా విభజించి పలు రూపాల్లోకి ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నల్ల ధనాన్ని బంగారం రూపంలో దాచుకుంటున్నారని ఆయన అన్నారు. కొందరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుండగా మరి కొందరు స్టాక్ మార్కెట్, మ్యూచివల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ రంగాల్లోకి నిధులను భారీగా మళ్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఇవి లెక్కల్లో కనిపించినా, బంగారం రూపంలోకి మారి ఆభరణాలుగా బీరువాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని గుర్తించడం, వెలికితీయడం చాలా కష్టమని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు బదులు ఆదాయ పన్నులు రాబట్టే విధానంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆదాయ పన్నుకట్టగల స్థోమత ఉండి కూడా కట్టని వారిని ఊపేక్షించకూడదన్నారు. అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తే నల్ల ధనాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రెండేళ్ళ కిందట అభిప్రాయపడ్డారు.

No comments:

Powered by Blogger.