pop

ట్రంప్‌కి టైమివ్వండి: ఒబామా


లీమా (పెరు): అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌పై అప్పుడే ఓ అభిప్రాయానికి వ‌చ్చేయ‌కండ‌ని అన్నారు ప్ర‌స్తుత అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా. ఆయ‌న వ‌ల్ల ఏదో చెడు జ‌రుగుతుంద‌ని అప్పుడే ఓ అంచ‌నాకు రావ‌ద్ద‌ని, ట్రంప్‌కు కాస్త స‌మ‌యం ఇవ్వాల‌ని లాటిన్ అమెరికా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అధ్య‌క్ష హోదాలో చివ‌రిసారి యూర‌ప్‌, లాటిన్ అమెరికా పర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన ఒబామా.. శ‌నివారం రాత్రి పెరు రాజ‌ధాని లీమాలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. యూర‌ప్‌లో చెప్పిందే తాను ఇక్క‌డా చెప్ప‌ద‌ల‌చుకున్నాన‌ని ఒబామా అన్నారు. ట్రంప్ ప్ర‌భుత్వం పూర్తిగా కొలువుదీరేవ‌ర‌కు వేచి చూడండి. వాళ్ల విధానాలు ఇప్పుడే తుదిరూపు దాల్చుతున్నాయి. ఆ త‌ర్వాత శాంతి, సౌభ్రాతృత్వాల‌తో ముందుకు సాగాల‌న్న అంత‌ర్జాతీయ స‌మాజం ప్ర‌యోజనాల‌కు అనుగుణంగా ట్రంప్ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందో లేదో చూడండి అని ఒబామా కోరారు. మెక్సికో నుంచి అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను అడ్డుకుంటాన‌ని, ముస్లింలు అమెరికాలో అడుగుపెట్ట‌కుండా నిషేధం విధిస్తాన‌ని ట్రంప్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే ట్రంప్‌పై ఇప్ప‌టికిప్పుడే త‌ప్పుడు అంచ‌నాల‌కు రావ‌ద్ద‌ని, ఆయ‌న టీమ్ మొత్తం కొలువుదీరే వ‌ర‌కు వేచిచూడాల‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి, వాళ్ల విధానాల‌కు తుది రూపునిచ్చే వ‌ర‌కు చూడండి. ఎందుకంటే మీరు ప్ర‌చారంలో ఏం చెప్పినా.. పాల‌న విష‌యానికి వ‌చ్చేస‌రికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే నేను ప‌లుసార్లు చెప్పాను అని ఒబామా అన్నారు. డెమొక్రాట్ల విధానాల‌ను తాను రాగానే ర‌ద్దు చేస్తాన‌ని ట్రంప్ చెప్పినా.. వాటిలోని సానుకూలాంశాల‌పై ఆయ‌న పాజిటివ్‌గా ఉంటార‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని ఒబామా చెప్పారు. లాటిన్ అమెరికా విష‌యానికి వ‌స్తే కొత్త పాల‌క వ‌ర్గం విధానాల్లో పెద్ద‌గా మార్పులు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

No comments:

Powered by Blogger.