pop

సామాన్యుడిని మభ్య పెట్టి బ్యాంకుల ఘరానా మోసం!


న్యూఢిల్లీ: మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా పది రోజుల నుంచి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పనులు మానుకుని మరీ బ్యాంకుల ముందు కొత్త నోట్ల కోసం, చిల్లర కోసం క్యూ కడుతున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం సరైందే అయినప్పటికీ, అమలులో విఫలం కావడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సామాన్యుల సంగతి సరే, మరి బడా బాబుల పరిస్థితి ఏంటి? బ్లాక్‌మనీ దొంగలు ఏం చేస్తున్నారు? వీలైనన్ని విధాలుగా బ్లాక్‌ను వైట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే నల్ల దొంగలు ఆడుతున్న చదరంగంలో పావులుగా మారుతోంది మాత్రం సామాన్యుడే. వారికి సహకరిస్తుంది బ్యాంకులే. ఇంతకీ అసలు విషయమేంటంటే, చిల్లర కోసం, కొత్త నోట్ల కోసం క్యూ కడుతున్న సామాన్యుడిని కొన్ని బ్యాంకులు నిలువునా దగా చేస్తున్నాయి. ఐడీ ఫ్రూఫ్‌తో ఆశగా నిలబడిన కొందరు, కౌంటర్ దగ్గరకెళితే బ్యాంకు ఉద్యోగులు చెబుతున్న సమాధానం ఒక్కటే. ‘మీ ఐడీ ఫ్రూఫ్‌పై ఇంతకు ముందే డబ్బు తీసుకున్నారు... మీ ఐడీ చెల్లదు’. ఈ సమాధానం విన్న సగటు జీవికి గుండె పగిలినంత పనైంది. ఈ వింత వ్యవహారంపై స్టింగ్ ఆపరేషన్ చేసిన ఓ నేషనల్ మీడియా చానల్‌ వాస్తవాలను బయటపెట్టింది. కొన్ని సంస్థలు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఐడీ కార్డులను దుర్వినియోగం చేస్తున్నాయని తేలింది. కొందరు బ్యాంకు మేనేజర్లు ఈ బ్లాక్‌మనీ మార్పిడికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. రోజుకు 4వేల రూపాయల వరకూ ఒక్కో ఐడీ ఫ్రూఫ్‌ను ఉపయోగించి మార్పిడి చేస్తున్నారు. కొన్ని టెలికామ్ కంపెనీలు బడా బాబులతో కుమ్మక్కై ఈ బ్లాక్‌మనీ మార్పిడికి సహకరిస్తున్నట్లు సమాచారం. సిమ్ తీసుకోవడానికి ఇచ్చిన ఐడీ ఫ్రూఫ్స్‌తో ఈ బ్లాక్‌మనీని సులువుగా బ్యాంకుల్లో వైట్ చేసేస్తున్నారు.

No comments:

Powered by Blogger.