pop

ఇదేంది పటేలా?


ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అప్పుడెప్పుడో నవంబరు 8వ తేదీన పెద్దనోట్ల రద్దు ప్రకటన రోజున టీవీల్లో కనిపించిన ఆయన... ఇప్పటిదాకా మళ్లీ జనం ముందుకురాలేదు. ఏ రోజుకారోజు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్‌ నుంచే ప్రకటనలు వస్తున్నాయి. కానీ పటేల్‌ ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు? దీనికి కారణం ఏమిటి? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాలను అంచనా వేయడంలో విఫలమైనందుకు ఉర్జిత్ పటేల్‌పై ప్రధాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ‘‘కొత్త నోట్లను ఏటీఎంలలోకి చేర్చడానికి రెండు రోజుల సమయం సరిపోతుంది. ఆ రెండు రోజులు సెలవులు ప్రకటిస్తే తర్వాత అందరికీ వెంట వెంటనే డబ్బు అందించవచ్చు’’ అని ఉర్జిత్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో 9, 10 తేదీల్లో ఏటీఎంలకు ‘సెలవిచ్చారు.’ ఆ తర్వాతే అసలు సమస్య బయటపడింది. కొత్త నోట్లను ఏటీఎంలు అంగీకరించడం లేదని, వాటికి అనుగుణంగా ఏటీఎంలను పునర్‌ వ్యవస్థీకరించడానికి మరింత సమయం పడుతుందని ఉర్జిత్ పటేల్‌ పేర్కొన్నారు. దీంతో ప్రధాని తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలిసింది. సుమారు ఆరు నెలలపాటు కసరత్తు చేసి, అన్నీ ఆలోచించి, అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోగా... చివరి నిమిషంలో సమస్యలు తలెత్తడం పట్ల ఉర్జితపై ప్రధాని అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మొదట వారం రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. ఇప్పుడు 12 రోజులు దాటింది. ఏటీఎంల ముందు జనం క్యూలు తరగడంలేదు. మరోవైపు... కొత్త 500, 2వేల రూపాయల నోట్లను బ్యాంకులకు చేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, గ్రామీణ ప్రజల కష్టాలను ముందుగా అంచనా వేయడంలో కూడా ఆర్బీఐ విఫలమైందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల వల్ల ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉందని పీఎంవో వర్గాలు కూడా భావిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న కీలక సమావేశాలకు ఉర్జిత పటేల్‌ను దూరంగా ఉంచినట్లు తెలిసింది. ఏటీఎంల పునర్‌ వ్యవస్థీకరణకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముద్రాను నియమించడం వెనుక అసలు కారణం కూడా ఇదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సృష్టించిన సంక్షోభం తేలేలోపు ఎవరిపై ‘వేటు’ పడుతుందోనని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు కూడా భయంభయంగానే ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో... పెద్దనోట్ల రద్దు ప్రభావాన్ని అధికారులు ప్రభుత్వానికి సరిగా వివరించలేదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ తుషార్‌ధారా చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ‘‘ఈ నిర్ణయం పదునైన ఉపకరణంలాంటిది. దీనిని అత్యంత జాగ్రత్తగా ప్రయోగించాలి. తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి చాలా ప్రణాళిక రచించాలి. ఈ విషయాలేవీ ప్రభుత్వానికి సరిగా వివరించలేదని నా అభిప్రాయం’’ అని చెప్పారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రాజకీయ నిర్ణయంలో భాగమేనని, అధికారుల పాత్ర ఏమీ లేదని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగరియా తనను కలిసిన విలేకరులకు తెలిపారు. రాజకీయ నేతలే మీడియా ముందుకు వచ్చి పరిస్థితి వివరించడానికి కారణం ఇదేనని ఆయన చెప్పారు.

No comments:

Powered by Blogger.