pop

దేశం మొత్తం నోట్లరద్దుతో అల్లాడుతుంటే... ఈ ఒక్క ఊరు మాత్రం...


హలియాల్: బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం విలవిలలాడిపోతున్నారు. అమలులో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బ్యాంకుల ముందు ప్రజలు పనులు మానుకుని క్యూలో నిల్చుని అష్టకష్టాలు పడుతున్నారు. అయితే కర్ణాటకలోని ఓ గ్రామం మాత్రం ప్రస్తుత పరిస్థితులకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఉత్తర కర్ణాటక జిల్లాలోని హలియాల్‌కు 10 కిలోమీటర్ల దూరంలో టిని అనే గ్రామం ఉంది. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఈ గ్రామ ప్రజలకొచ్చిన నష్టమేమి లేదు. దీనికి కారణం ఉంది. ఈ గ్రామ ప్రజలు రెండు వారాలకు 5వందల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. పొదుపు అనుకుంటే పొరపాటే. ఈ గ్రామ ప్రజలు టౌన్‌కు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కాల్సిందే. బస్సు కూడా రోజుకు రెండు సార్లు మాత్రమే ఉంటుంది. ఆ బస్సు దొరక్కపోతే మళ్లీ నిరాశతో వెనుదిరగాల్సిందే. ఎందుకంటే, ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఊరి జనాభా 1000 మందికి పైగానే. వీరిలో చాలామంది వ్యవసాయ కూలీలే. కానీ అతి తక్కువ మందికి మాత్రమే బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి. ఉదయం 8 గంటలకు పొలానికెళితే తిరిగి ఇంటికొచ్చేది సాయంత్రానికే. రోజుకు 150 రూపాయల కూలి. నోట్లు రద్దు కావడంతో కూలి డబ్బులు ఇవ్వడం లేదు. ఇచ్చినా పాతనోట్లే ఇస్తున్నారు. వారం రోజుల నుంచి చాలామంది కూలి డబ్బులు ఇవ్వలేదు. పాత నోట్లు ఎలా మార్చుకోవాలో కూడా ఈ గ్రామస్థులకు తెలియదు. దీంతో, దేశం మొత్తం చిల్లర కోసం బ్యాంకుల ముందు క్యూ కడుతుంటే ఈ ఒక్క ఊరి ప్రజలు మాత్రం ఉన్న చిల్లరతోనే సరిపెట్టుకుని బతుకీడుస్తున్నారు

No comments:

Powered by Blogger.