pop

అగ్రస్థానంలో భారత్‌.. ఎందులోనో తెలుసా?


హైదరాబాద్‌: అగ్రస్థానంలో నిలిచామని ఆనందించాల్సిన అంశం కాదది.. ఆందోళన చెందాల్సిన గణాంకాలివి. సాంకేతికత తన పరిధిని విస్తృతం చేసుకుంటూ ఇప్పుడు అందరినీ పలకరిస్తోంది. నేటి కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. దీంతో ఓ సెల్ఫీ దిగి ఆన్‌లైన్‌లో షేర్‌ చేసుకోవడం యువతకు ఓ హాబీగా మారిపోయింది. అయితే కాస్త భిన్నంగా ఫొటో దిగాలన్న తాపత్రయంలో పరిస్థితుల పరిమితులను పట్టించుకోకుండా కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫొటోకోసం ప్రాణాలొడ్డుతున్నారు. నదులు, ఎత్తైన పర్వతాలు, రైల్వేట్రాక్‌లు, పెద్ద భవంతులు ఇలా పలుచోట్ల సెల్ఫీ క్రేజ్‌లో ముప్పుకొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ పరిశోధక బృందం ప్రపంచంలో సెల్ఫీ తీసుకుంటూ మృతి చెందిన వారి గణాంకాలను సేకరించింది. దీన్ని అధ్యయనం చేసి ఇందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌లోనే ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నాయన్న చేదు వాస్తవం వెలికివచ్చింది. ప్రపంచంలో దాదాపు 127 మంది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రాణాలు కోల్పోయారట. తొలి ఘటన మార్చి 2014లో నమోదైంది. ఇందులో భారత్‌లోనే 76 మంది మృత్యువాత పడ్డారు. పొరుగు దేశం పాకిస్థాన్‌లో 9 మంది, అమెరికాలో 8 మంది, రష్యాలో ఆరుగురు, చైనాలో నలుగురు, స్పెయిన్‌లో ముగ్గురు, ఇతర దేశాల్లో 21 మంది మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ బృందం ప్రస్తుతం ఓ యాప్‌ను తయారుచేసే పనిలో ఉన్నారు. ఎవరైనా సెల్ఫీ తీసుకునేటప్పుడు అది ఒకవేళ ప్రాణాంతకమైతే ఈ యాప్‌ వారిని హెచ్చరిస్తుంది.

No comments:

Powered by Blogger.