pop

అవి పాము పుట్టలు కాదు.. ఇళ్లు




మారిన కాలానికి తగ్గట్లు మోడ్రన్‌గా ఇళ్లు కట్టుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. కళ్లు చెదిరే డిజైన్లతో నివాసాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటున్నారు. కానీ.. ఇరాన్‌లోని ఓ వూరిలో ప్రజలు మాత్రం ఇంకా గుహల్లోనే నివసిస్తున్నారు. 700 ఏళ్లుగా ఆ గుహల్లోనే ఉంటున్నారు. వాయవ్య ఇరాన్‌లో ‘కండోవాన్‌’ అనే గ్రామం ఉంది. అక్కడ ఎటు చూసినా గుంపుగుంపులుగా గూళ్లు కనిపిస్తాయి. వాటిని స్థానిక భాషలో ‘కరన్‌’ అని పిలుస్తారు. ఎత్తైన పాముల పుట్టలు ఎలా ఉంటాయో ఆ గూళ్లు అలానే ఉంటాయి. అవే కొండ ప్రాంతపు గుహలు. ఆ గుహలనే అక్కడి ప్రజలు గృహాలుగా మార్చుకున్నారు. వాస్తవానికి ఈ గుహలు అగ్నిపర్వతం పేలడం వలన ఏర్పడ్డాయని కొందరు పరిశోధకులు అంటున్నారు. కానీ 700 సంవత్సరాల క్రితమే తమ పూర్వీకులు వాటిని సృష్టించారని స్థానికులు తమ వాదనను వినిపిస్తున్నారు. ఒకప్పుడు మంగోల్‌ ఆర్మీ జవాన్లు యుద్ధం సమయంలో ఈ గుహల్లోనే తల దాచుకునేవారట. తదనంతరం స్థానిక ప్రజలు వాటిని నివాసాలుగా మార్చుకున్నారు. ఒక్కో గుహలో మూడు గదులు, ఒక స్టోర్‌ రూమ్‌తోపాటు పెంపుడు జంతువులకు ప్రత్యేకంగా షెల్టర్‌ ఉంటుంది. కిటికీలు, తలుపులు, పై అంతస్థుకు వెళ్లడానికి మెట్లు కూడా ఉంటాయి. అన్నింటికీ మించి ఈ గుహలకుండే ప్రత్యేకత ఏంటంటే... వేసవికాలం ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. అందుకే పర్యాటకులకు ఇవి ఆహ్లాదాన్ని కలిగించే గుహలనే చెప్పాలి. ఎవరైనా ఇక్కడికి చేరుకోవాలంటే ఇరాన్‌కి పశ్చిమంగా అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌కి 60 కి.మీ పయనించాలి.

No comments:

Powered by Blogger.