pop

స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎస్సెమ్మెస్‌లన్నీ చైనాకే


తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో దొరికే స్మార్ట్‌ఫోన్లను కొంటున్నారా..? అలాంటివారు తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు అమెరికా సెక్యూరిటీ నిపుణులు. బడ్జెట్‌ ఫోన్లలో వినియోగదారుల భద్రత కొరవడుతోందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆధారాలతో సహా బయటపెట్టారు. ‘బ్లూ’ సంస్థ తయారు చేసిన బడ్జెట్‌ ఫోన్ల నుంచి వినియోగదారులు పంపే మెసేజ్‌లన్నీ చైనాలోని ఓ రహస్య సర్వర్‌కు వెళ్తున్నట్లు ‘క్రిప్టోవైర్‌’ అనే సెక్యూరిటీ సంస్థ నిపుణులు గుర్తించారు. ఫోన్లలో ఇన్‌స్టాలై ఉన్న ఓ అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌.. వినియోగదారులకు తెలియకుండా మెసేజ్‌లను షాంగైలోని సర్వర్‌కు చేరవేస్తోందని వెల్లడించారు. మేసేజ్‌లతోపాటు, వినియోగదారుల లొకేషన్‌ డేటాను, కాల్‌ లిస్టును, కాంటాక్ట్‌లను, ఫోన్‌లోని యాప్‌ల డేటాను ప్రతి 72 గంటలకు ఒకసారి ఆ సర్వర్‌కు చేరవేస్తోందట. అయితే.. ఆ సమాచారమంతా చైనా ప్రభుత్వానికి వెళ్తుందా? లేదా? అన్న విషయం మాత్రం తేలాల్సిఉంది. షాంగైలోని ‘అడుప్స్‌ టెక్నాలజీ’ సంస్థ ఆ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు నిపుణులు గుర్తించారు. సుమారు 70కోట్ల స్మార్ట్‌ఫోన్లలో ఈ సాఫ్ట్‌వేర్‌ ఉన్నట్లు అంచనా. జెడ్‌టీఈ.. హువాయి వంటి సంస్థలు కూడా అడుప్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్లను వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో డెలివరీ చేసిన దాదాపు లక్షా 20వేల డివైజ్‌లలో ఈ సాఫ్ట్‌వేర్‌ ఉన్నట్లు అంచనా వేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన ‘బ్లూ’ సంస్థ వెంటనే ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించనున్నట్లు తెలిపింది.

No comments:

Powered by Blogger.