pop

గూగుల్‌, ఫేస్‌బుక్‌ అనూహ్య నిర్ణయం


వాషింగ్టన్‌: సంచలనాల కోసం అవాస్తవ వార్తలను ప్రచురిస్తున్న వెబ్‌సైట్లపై సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌, ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లు అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. ఇక అలాంటి వైబ్‌సైట్లకు ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సమాచారం విస్తృతంగా వ్యాప్తి కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయానికి వచ్చాయి. సంచలన వార్తలను ప్రచురించి పలు వెబ్‌సైట్లు ప్రజాభిప్రాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో బోగస్‌ వార్తలను సృష్టించి సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ ఆదాయాన్ని గడిస్తున్నాయి. ఇలాంటి వెబ్‌సైట్లకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఏకతాటిపైకి వచ్చాయి. తాజా నిర్ణయంతో ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురిస్తున్న వెబ్‌సైట్లకు ప్రకటనలు అందవు. ‘అప్రాధాన్య, సంచలన సమాచారం ప్రచురించే వాటికి గూగుల్‌ ప్రకటనలను నిషేధిస్తుంది. ఇందుకు మా ప్రకటన విధానాలు, మార్గ దర్శకాలను మార్పు చేశాం’ అని గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపినట్లు ఏఎఫ్‌సీ పేర్కొంది. ముఖ్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచురణకర్తలు, వారి వెబ్‌సైట్లకు ప్రకటనలు నిషేధిస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ.. ‘నిత్యం వందలాది తప్పులు దొర్లిపోతున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంఘటనలు కూడా జరిగాయి. వాటి నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. ఇలాంటివి జరగకుండా ప్రయత్నిస్తున్నాం. దీనిపై చర్చించే ఉద్దేశం లేదు. కానీ అత్యంత విశ్వసనీయ వార్తలను అందించేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకు అనుగుణంగా నిజ నిర్ధారణకు మా అల్గారిథమ్స్‌లో కచ్చితంగా మార్పు చేస్తాం’ అని అన్నారు.

No comments:

Powered by Blogger.