pop

భారత్‌లో చర్మ రంగు గుట్టు తెలిసింది


హైదరాబాద్‌: మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేకమైన జన్యువు కారణమని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధనలో తేలింది. సీనియర్‌ ప్రిన్స్‌పల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.తంగరాజ్‌ నేతృత్వంలో వేర్వేరు దేశాల్లోని ఐదు ఇతర సంస్థలతో కలిసి దీనిపై చేసిన తాజా పరిశోధన పత్రం ‘ది జర్నల్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ డెర్మటాలజీ’ ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ఈనెల 17న ప్రచురితమైంది. ఆఫ్రికా దేశాల్లో నలుపు, ఐరోపాలో తెల్లవాళ్లు ఎక్కువగా ఉంటే భారతలో నలుపు, తెలుపు, ఎరుపు ఇలా వేర్వేరు వర్ణాల్లో ఉన్నారు. చర్మ రంగులో ఈ వైవిధ్యానికి మిలానిన్‌ అనే పిగ్మెంట్‌ ప్రధాన కారణమని మొదట భావించేవారు. చర్మ వర్ణంలో తేడాలకు జన్యుమార్పునకు సంబంధం ఉందని ఎస్‌ఎల్‌సీ24ఏ5 అనే జన్యువును గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. దాన్ని ఆధారంగా ఆఫ్రికా, యూరోపియన్ల వర్ణంలో దాదాపు 25-38శాతం మార్పు కనబడుతోందని పరిశోధనలో తేలింది. తాజా పరిశోధనలో ముఖ్యంగా మన దేశంలో వేర్వేరు చర్మ రంగులు ఉండటానికి మరో ప్రత్యేకమైన జన్యువు ఆర్‌ఎస్‌2470102 కారణమని పరిశోధకులు విశ్లేషించారు. తాజా పరిశోధన భవిష్యత్తులో వ్యక్తిగత ఔషధాలను సూచించేందుకు ముందడుగు అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా తెలిపారు.

No comments:

Powered by Blogger.