pop

వీధి బాలలను చేరదీసి.పాఠాలు చెబుతున్న రైల్వే పోలీసులు.


సాధారణంగా మనకు రైల్వే స్టేషన్లలో ఏం కనిపిస్తాయి..? కూ. చుక్ చుక్‌. మంటూ వచ్చీ పోయే రైళ్లు, రైలు ఎక్కడ వెళ్లిపోతుందేమోనని త్వర త్వరగా ప్లాట్‌ఫాంలపైకి పరుగులు తీసే ప్రయాణికులు, తినుబండారాలు, టిఫిన్లు, మ్యాగజైన్ల వంటి వస్తువులను అమ్ముకునే చిరు వ్యాపారులు, కూలీలు. వగైరా వగైరా కనిపిస్తారు. కానీ గయ రైల్వే స్టేషన్లో మాత్రం వీటన్నింటితోపాటు మరో దృశ్యం కూడా మనకు నిత్యం కనిపిస్తుంది. అదేమిటంటే. రైల్వే స్టేషన్లలో వీధి బాలలు యాచన చేస్తూ తిరుగుతారు కదా..! ఇంకొందరు పిల్లలు ఏం చేయాలో తెలియక ప్లాట్‌ఫాంలపై తచ్చాడుతూ ఉంటారు. కొందరు ఆటలాడుతుంటారు. అయితే గయ రైల్వే స్టేషన్ లోనూ ఒకప్పుడు ఇలాంటి పిల్లలు ఉండేవారు.కానీ ఇప్పుడు వారందరూ ముందు చెప్పినట్టుగా అస్తవ్యస్తంగా కనిపించరు. ఎంతో చక్కగా యూనిఫాం వేసుకుని, బుద్ధిగా ఓ చోట కూర్చుని చదువుకుంటూ కనిపిస్తారు. దీనంతటికీ కారణం ఏ స్వచ్ఛంద సంస్థో, లేదంటే ఉదార స్వభావం ఉన్న సామాజిక వేత్తలో కాదు, గయ రైల్వే పోలీసులే వారి ఇప్పటి స్థితికి కారణం..! గయ రైల్వే స్టేషన్‌లో పైన చెప్పినట్టుగా ఒకప్పుడు చాలా మంది వీధి బాలలే ఉండేవారు. కానీ వారందరికీ అక్కడి పోలీసు సిబ్బంది చదువు చెప్పడం ప్రారంభించారు. అందరికీ యూనిఫాంలు ఇప్పించి, ప్లాట్‌ఫాంపై ఒక చోట కూర్చోబెట్టి చదువు చెప్పడం షురూ చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రవీణ్ కుమార్ అనబడే ఓ పోలీసు అధికారిని కూడా నియమించారు. అతను రోజూ ఆ పిల్లలకు చదువు చెబుతున్నాడు. అతనితోపాటు అదే రైల్వే పోలీసు విభాగంలో పనిచేసే డీఎస్‌పీ, ఇన్‌స్పెక్టర్లు కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ పిల్లలకు చదువు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ పిల్లలు అనేక అంశాలను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు కూడా. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే. పోలీసు అంకుల్స్ చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఎప్పటికప్పుడు చదువు కొనసాగిస్తున్నామని, తాము ఇప్పుడు ఒకప్పటి మురికి పిల్లలం కాదని, భవిష్యత్తులో ఎంతో గొప్పవారమవుతామని చెబుతున్నారు. ఇదంతా గయ రైల్వే పోలీసుల చలవే అంటే మీరు నమ్మగలరా..? కానీ ఇది నిజమే. నిజంగా పోలీసులంటే సమాజ రక్షకులే కాదు, పౌరులను తీర్చిదిద్దే ఉద్యోగులు కూడా. అదే బాధ్యతను ఇప్పుడు వారు నిర్వర్తిస్తున్నారు. అలాంటి ఆ పోలీసులకు నిజంగా మనం అభినందనలు తెలపాల్సిందే కదా..

No comments:

Powered by Blogger.