pop

అమెరికా విదేశాంగ మంత్రిగా నికీ హేలీ?


వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ మంత్రి పదవికి భారత సంతతికి చెందిన సౌత కరోలినా గవర్నర్‌ నికీ హేలీ (44) పేరు ట్రంప్‌ పరిశీలనలో ఉన్నట్లు ‘ది పోస్ట్‌ అండ్‌ కొరియర్‌’ పత్రిక గురువారం తెలిపింది. మొదటి భారతీయ-అమెరికన్‌ మహిళా గవర్నర్‌, ఆ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌ కూడా అయిన హేలీ.. ప్రైమరీ ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ పార్టీలోని ట్రంప్‌ ప్రత్యర్థి మార్కో రుబియోకు మద్దతు పలికారు. ఆయన రేసు నుంచి వైదొలిగాక ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. సౌత కరోలినా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హెన్రీ మెక్‌మాస్టర్‌ మాట్లాడుతూ.. విదేశాంగం సహా పలు కేబినెట్‌ పోస్టులకు ఆమె పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. నిజానికి విదేశాంగ మంత్రి పదవికి న్యూయార్క్‌ మాజీ మేయర్‌ రూడీ గిలియానీ పేరు గట్టిగా వినిపిస్తోంది. ట్రంప్‌ను శుక్రవారం కలిసే రిపబ్లికన్ల జాబితాలో నికీతో పాటు విదేశాంగ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌, రిటైర్డ్‌ జనరల్‌ జాక్‌ కీన్‌, అడ్మిరల్‌ మైక్‌ రోజర్స్‌, కెన్‌ బ్లాక్‌వెల్‌ కూడా ఉన్నారని అధికార బదిలీ బృంద ప్రతినిధి సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు. ఇప్పటికే మరో ఇండో-అమెరికన్‌, లూయిసియానా మాజీ గవర్నర్‌ బాబీ జిందాల్‌ పేరు కూడా కేబినెట్‌ పదవులకు వినిపిస్తోంది. కాగా.. జాతీయ భద్రత సలహాదారుగా తనకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మైకేల్‌ ఫ్లిన్‌ పేరును ట్రంప్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

No comments:

Powered by Blogger.