pop

గాలి జనార్దన్‌రెడ్డి రీ ఎంట్రీ..?


ఆంధ్రజ్యోతి, బెంగళూరు: ఐదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలే కాకుండా దాదాపు అన్ని వ్యవహారాలు, వ్యాపారాలను పక్కనపెట్టి కేసులతోనే సతమతమైన గనుల వ్యాపారి గాలి జనార్దనరెడ్డి మరోసారి రాజకీయాలవైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె వివాహం ద్వారా నెల రోజులుగా చర్చలకు కారణమైన గాలి జనార్దనరెడ్డి రాజకీయాలలో ప్రవేశించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 2011 సెప్టెంబరు 5న గనుల అక్రమాల కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ సారథ్యంలోని బృందం బళ్లారిలో అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన కేసులనుంచి బయటపడేందుకు చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టింది. ఇటీవలే నిబంధనల బెయిల్‌తో బయటకు వచ్చారు. జైలునుంచి జనజీవనంలోకి వచ్చి నా... రాజకీయ, సామాజిక, సేవా రంగాలకు దాదాపు దూరంగానే గడిపారు. కుమార్తె వివాహంతో ఆయన పతాక శీర్షికలకెక్కారు. ఆడంబరంగా పెళ్లి చేసి దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా పార్లమెంటు ఉభయసభల శీతాకాల సమావేశాల ఆరంభం రోజే చర్చకు కారణమయ్యారు. కుమార్తె వివాహానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ప్రముఖ నేతలందరితోపాటు జాతీయ స్థాయిలోనూ ప్రముఖులను ఆహ్వానించారు. అయితే గాలి కుమార్తె వివాహానికి హాజరైతే ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తోందనని ప్రముఖ నేతలు వెనుకంజ వేశారు. కర్ణాటకకు చెందిన బీజేపీ మాజీ సీఎం లు యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్‌, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ప్రస్తుత మంత్రులు పరమేశ్వర్‌, డీకే శివకుమార్‌తోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏ పార్టీ కూడా ‘గాలి’ని ఆహ్వానించేది అనుమానమేననిపిస్తోంది. అయితే గతంలో ఆయన బీజేపీలో కీలక నేతగాను, మంత్రిగాను కొనసాగినందున అదే పార్టీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. జాతీయ నాయకులు ఆయన రాకపై ఎలా స్పందిస్తారనేది ప్రధానమైన అంశంగా ఉంది.

No comments:

Powered by Blogger.