pop

ఆటోలకు ఉచితంగా పెట్రోలు


Related imageతిరునెల్వేలి: తిరునెల్వేలిలోని ఓ పెట్రోలు బంకులో ఆటోలకు ఉచితంగా పెట్రోలు పంపిణీ చేస్తున్న వ్యవహారం శనివారం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన నగదుతో పెట్రోలును ఉచితంగా అందిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ పెట్రోలు బంకు నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకోగా మరో పెట్రోలు బంకులోనూ ఇలాంటి ప్రయత్నం జరిగినట్లు గుర్తించి అక్కడి నుంచి కూడా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లధనాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా ఓ రాజకీయపార్టీ ప్రముఖులు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రచారం సాగింది. తిరునెల్వేలి కొత్త బస్టాండు సమీపంలోని పెట్రోలు బంకులో శుక్రవారం రాత్రి ఆటోలకు ఉచితంగా పెట్రోలు పంపిణీ చేసినట్లు తెలిసింది. దీంతో శనివారం ఉదయాన్నే పలు ఆటోలు ఆ పెట్రోలు బంకు వద్ద బారులు తీరాయి. పెట్రోలు బంకు సిబ్బంది కూడా ఆ ఆటోలకు పెట్రోలు అందించి డబ్బులు తీసుకోకుండా ఆటోల నంబరు రాసుకుని వాటిని పంపించి వేశారు. ఆ పెట్రోలు బంకు వద్ద బారులు తీరిన ఆటోల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టించడంతో మేలపాళయం పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీశారు. సదరు పెట్రోలు బంకు సిబ్బందిని విచారించగా శుక్రవారం రాత్రి మోటారుబైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రూ.500, రూ.1000 నోట్లతో కూడిన రూ.50 వేలు నగదు ఇచ్చి తమ బంకుకు వచ్చే ఆటోలకు ఉచితంగా పెట్రోలు పంపిణీ చేయాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకు సదరు ఆటోల నంబరు, వాటికి పెట్రోలు అందించిన పరిమాణం గురించి జాబితా సిద్ధం చేయాలని కూడా కోరినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం వరకు రూ.46 వేల పెట్రోలు పంపిణీ చేసినట్లు చెప్పడంతో మిగిలిన రూ.4 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేలపాళయంలోని ఓ పెట్రోలు బంకులోనూ రూ.50 వేలను గుర్తుతెలియని వ్యక్తులు అందించారని, అయితే ఆ పెట్రోలు బంకులో ఎవరికీ ఉచితంగా పెట్రోలు అందించలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో ఆ పెట్రోలు బంకు నుంచి రూ.50 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Powered by Blogger.