pop

మందు బాబులకు వాట్సాప్ గ్రూప్‌లు


బంజారాహిల్స్ నుంచి బేగంపేట్ రూట్ క్లియర్... సోమాజిగూడ నుంచి చాదర్‌ఘాట్ మధ్య కోఠి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది.. ప్రత్యామ్నాయ రూట్ ఎంచుకోండి... అమీర్‌పేట్ నుంచి కూకట్‌పల్లి రూట్ క్లియర్.. ఇలా మందుబాబులు వాట్సాప్ గ్రూప్‌లలో రాత్రి వేళల్లో జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ వివరాలను షేర్ చేసుకుంటున్నారు.. ఈ విషయాన్ని పసిగట్టిన నగర ట్రాఫిక్ పోలీసులు ఆకస్మాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు ఇంతకు ముందు వారాంతంలో రాత్రి సమయాల్లో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ఇప్పుడు వారంలో అన్ని రోజులు నిర్వహిస్తున్నారు. దీనికితోడు పగటి పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రమ్య ఘటన అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్‌ను మరింత కఠినతరం చేశారు. పట్టుబడ్డ వారి కార్యాలయాలకు, కళాశాలలకు ట్రాఫిక్ పోలీసులు వెళ్లి ఒక రిమార్కు లెటర్‌ను అందిస్తున్నారు. ఇది వారి భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారింది. పలు రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటామని యువత గుర్తించింది. ఇందుకు పోలీసులకు పట్టుబడకుండా ఉండాలని వాట్పాప్ గ్రూప్ తయారు చేసింది.
వాట్సాప్‌లో ఇలా... నవీన్(మారుపేరు) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి రూట్ క్లియర్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశాడు. ఇందులో మొదట అతని స్నేహితులు.. వారి వా రి స్నేహితులు ఇలా సుమారు 80 మంది వరకు చేరారు. క్రమంగా ఈ సంఖ్య పది రోజుల వ్యవధిలో 250 మంది వరకు చేరింది. ఇందులో ఉన్న వారిలో కనీసం 10 నుం చి 20 మంది వేరు వేరు రూట్లకు సంబంధించిన వారు ఉన్నారు. సాయంత్రం, కార్యాలయాలు, కాలేజీల నుంచి వచ్చే సమయాలతోపాటు ఇతర సమయాల్లో తమ గ్రూప్‌లోని స్నేహితులకు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాలను షేర్ చేస్తున్నారు. దీంతో ఆ గ్రూప్‌లో మద్యం సేవించే వారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తుంటారు.
పసిగట్టిన పోలీసులు మందుబాబులు వాట్సాప్ గ్రూప్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు. గతంలో ఒకే చోట డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ఏర్పాటు చేసే వారు. తాజాగా ఎక్కడ పడితే తనిఖీలు చేస్తూ వాట్పాప్ గ్రూప్‌వారికి పోలీసులు ఝలక్ ఇస్తున్నారు.

No comments:

Powered by Blogger.